Monday, March 7, 2011

ఆకు-నీకు-బహుపరాకు!

ఆకు-నీకు-బహుపరాకు!

ఆకు-నీకు-బహుపరాకు!
ఆకు-పడబోకు నీపై నీవే చిరాకు!!
నీవు లేకుండా క్షణం గడవదు మాకు-మ్రాకుకు

విశ్వమంతా కాలగర్బంలో కలిసిపోయినా
జగమంతా జలప్రళయంలో లయమైపోయినా
నీవు-నీపై యోగనిద్రలో పరమాత్ముడు(వతపత్రశాయి)
ఉందనే ఉంటారుకదా!
నీవుంటెనే మాను(చెట్టు) మాను(మనోహరము)కదా
నీవులేకుంటే అది మోడే సదా!!
గణపతికి గరిక పోచలే ప్రియతమాలు
పశుపతికి బిల్వపత్రాలే సుపూజితాలు
తాటాకుతోనే తరతరాల సాహితీ సంపదలు
తమలపాకుతోనే అందాలు బంధాలు
ఒప్పందాలు సంబంధాలు!!
మామిడాకు కడితేనే ఇంటికి పండుగ
విస్తరాకున వడ్డిస్తేనే కడుపు నిండుగ
కోయిలకాపాటలు నీపల్లవాల వల్లేకదా
మూడునాళ్ళ ముచ్చటలు,మురిపాలు
పైపై మెరుగులు పూలసొత్తు !
కాని నీ సేవలకు తలవొగ్గు సర్వంసహా జగత్తు!!
ఉన్నంతకాలం
తిండివై నీడవై
మందువై మాకువై
నేలరాలినా నలిగి నాని
సేంద్రియ ఎరువై
తల్లి ఋణం తీర్చుకొనే
నీ విభవం అమోఘం,అప్రమేయం
నీ త్యాగం శ్లాఘనీయం!
మానవాళికి ప్రాణవాయువు నీ భిక్ష
జీవకోటికి నీవే కదా శ్రీరామ రక్ష!!
ఆకు-నీకు-బహుపరాకు!!!

వి’చిత్రం’

వి’చిత్రం’

వీ’క్షణము’లో ప్రణయమే ఉదయిస్తే
హృదయానికి అనుక్షణం యాతన!
హృదయంలో విరహమే జనియిస్తే
నయనానికి అహరహమూ వేదన!!