Friday, March 25, 2022

 "మహాభినిష్క్రమణ"

                              - డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


"నేను" విశ్వంలో లయమైపోతా

శూన్యంలో శూన్యమై మాయమౌతా

ఒక నిశ్శబ్ద నిశీధి చరమాంకంలో


ప్రళయమేం రాదు..

ఏ ప్రభుత్వమూ కూలదు

అతి సాధారణంగా

మరింత ప్రశాంతంగా తెల్లారుతుంది,

సోషల్ మీడియా పుణ్యమా అని

విషయం తెలియడం వల్ల

కొన్ని అయ్యోలు,అరెరేలు

మరిన్ని ప్చ్…హ్మ్ లమధ్య..


ఒక FB మిత్రుడు నా పిక్ వెతికి పట్టుకొని

లేదా నా గోడనాసరాగొని

ఒక RIP పడేస్తాడు…

ఓపిక ఉన్న ఒకరిద్దరు..

రాత్రే పోస్టుపెట్టాడే ఇంతలోనే ఇలానా

అని రెండు ముక్కల కామెంట్ పెడతారు..

ఆరోజో అంతక్రితమో చూసిన పోస్టునుండి

నలుగురు కాపీ పేస్టులు చేస్తారు..

నివాళి ,శ్రద్ధాంజలి..అంటూ తెలుగులోనూ

సందట్లో సడేమియాగా ఎవరో

'Many HAPPY returns of the day' అంటూ

పోస్ట్/పేస్ట్ చేసి చేతులు దులుపుకొని ముందుకి స్క్రోల్ చేస్తారు…


మనపోస్టుల  కెపుడైనా లైకో కామెంటో పెట్టాడా 

అనుకొంటూ ముందుకి స్క్రోల్ చేస్తారింకొందరు..

ఇవన్ని చూడ్డానికి మనమెలాగూ ఉండమన్నది ఎరిగిన సంగతే..

తప్పని సరైన ఆ నలుగురి సహకారంతో

దహనము దశదిన కర్మలూ జరిగిపోతాయి

ఐతేగియితే ఓ ఆనవాయితిగా

ఓ నలుగురితో

 ఓ సంతాప,సంస్మరణ సభ…


ఎంత అస్పష్టంగా ఈలోకానికి వచ్చామో

అంతకన్నా దయనీయంగా నిష్క్రమించడమే..

చరిత్రకెక్కినవాళ్ళు,చరిత్రలు సృష్టించినవాళ్ళు

జీర్ణంకాని వాస్తవమవుతూ

నాలా ఏ చరిత్రా లేనివాళ్ళూ, 

త్రిప్పేసిన పుటలౌతూ-

కాస్త అటూఇటూగా, ఇలా నిశ్శబ్దంగా

గాలిలో గాలిగా,నీటిలో నీరుగా 

నిప్పులో నిప్పుగా మట్టిలో మట్టిగా

అనంత శూన్యాకాశపు దిశగా

మహా ప్రస్థానం కొనసాగిస్తూ...

కనుమరుగౌతూ..స్మృతి మరుపౌతూ…!!

No comments:

Post a Comment