Friday, September 14, 2018

"గతజల సేతు బంధనం"

ఉద్ధరించాల్సిందే
మరొకరిని ముంచకుండా
ఆచరించాల్సిందే
వక్ర మార్గాలు తొక్కకుండా..

కాలుష్య నియంత్రణ మంచిదే
కల్తీ డిజిల్ పెట్రోల్ నరికడితేనో
పాథిలీన్ నివారణ ఆవశ్యకమే
ఉత్పాదకత నడ్డుకుంటే చాలదూ..

భారీతనం భక్తిని తొక్కేస్తూన్న తరుణంలో
చిట్టి మట్టి గణపతి పూజ శ్రేష్ఠమే
వికృత వింత రూపాల నేపథ్యంలో
ప్లాస్టరాపారిస్ ప్రతిమల
తయారీనే నిర్జిస్తే అదృష్టమే

హానికర కలర్లు ప్రచార ఫ్లెక్సీ వనర్లు
వాడకాలు నిలిపేస్తేనో మూలాలే పెకలిస్తేనో
కళాకారులకు ప్రత్యామ్నాయ భృతి కల్పిస్తేనో..

తాగి నడపడం ప్రాణాంతకమే
పట్టికేసులు పెట్టడం
అడుసులోతోసి., నీళ్ళనమ్ముకోవడమే
బార్లు మూసి., తాగడం ఇంటికే పరిమితం చేస్తేనో
మొత్తంగా మద్యపానమే నిషేధిస్తేనో..

మొసలి కన్నీళ్ళు కంటి తుడుపు ఓదార్పులు
ఎంత ప్రకటిస్తేనేం ఎక్స్ గ్రేషియాలు
కోలుకోగలవా కుటుంబాలు
తిరిగి తేగలమా పోయిన ప్రాణాలు
రోడ్డు రవాణా వ్యవస్థలు ఆధునీకరిస్తేనో
పర్యవేక్షణలో నిబద్ధత కనబరిస్తేనో..

నొప్పింపక తానొవ్వని ప్రణాళికలు రచించాలి
ఉభయతారకమయ్యే నవ్యరీతులు శోధించాలి
విచ్చలవిడి అవకాశాలనిడి
నిర్లక్ష్యపు కైపుల బడి
విపత్తుల ముందుచూపు విస్మరించనేల..!
ఆపత్తుల ఆకళింపులేక విలపించనేల..!!

No comments:

Post a Comment