Tuesday, December 25, 2012

||“ఆచూకి”-||

నా అన్వేషణ వస్తువు కోసమే...
అది దొరికితే..అందంగా ..
గిఫ్ట్ ప్యాక్ చేయడం పెద్ద కష్టమేం..కాదు...
అదే౦ చిత్రమో..నాకు మాత్రం కనబడి చావదు...
ఎంత వల్లి౦చినా వైవిధ్యం వంటబట్టదు..

కవిత్వం అంటే..
ఆకలి తీర్చే బన్ను మాట్లాడాలి..
వాడి పడేసిన కూల్డ్రింక్ టిన్ను..మాట్లాడాలి..
ఉస్మానియా లో..వర్షించిన రబ్బర్ బుల్లెట్ల గన్ను మాట్లాడాలి..
కమర్షియల్ కవితలకే పరిమితమైన పెన్ను మాట్లాడాలి..

ఊహు..ఏం లాభం..
శైలి నన్ను గేలి చేస్తూనే ఉంటుంది..
ఏం చేస్తాం,...
నెరవేరని సంకల్పం - నాదంటూ ఇంకా ఏర్పడని..శిల్పం.

ఏంతో మంది భావాల్లో....
నిర్జీవాలు కూడా ప్రాణం పోసుకొని 
చిందులు తొక్కుతుంటాయి..
గుట్టలు పిట్టలు..
చెట్టాపట్టాలేసుకొని..
కబుర్లు చెప్పుకొంటూ ఉంటాయి..

గాలికీ మేఘాలకి..ప్రేమ పుట్టుకొస్తోంది..
సూర్యుడికీ..వర్షానికీ..హర్షాతిరేకమౌతుంది...
హరివిల్లు విరియగానే...నేలకు నింగికీ మనువౌతుంది..

మత్తుగా పూల మకరందం తాగిన..సీతాకోక చిలుకలు..
చిత్తుగా ఎగురుతూ నాట్యం చేస్తాయి..
కడలి అలలు ఆత్రంగా ఆకాశాన్ని..చుంబిస్తాయి..
గొండ్రు కప్పలు.. కీచురాల్లతో..
గోడు వెళ్ళబోసుకొంటాయి..
చెట్లు తమ ఇక్కట్లు వక్కాణిస్తాయి

చంద్రుడూ వెన్నెల..
ప్రేమికుల కోసం కాపు కాస్తుంటాయి..
నిద్రతో..చెలిమి..వల్ల..
కలలు..గెలుస్తుంటాయి..
ఓడిపోయిన ప్రేమికుడిని..
జానీవాకర్ ఓదారుస్తూ ఉంటుంది..

ప్రతిసారీ..
ఎక్కడో అక్కడ ఏదో రూపం లో..
మెచ్చుకోనేలానో..నొచ్చుకోనేలానో..
జొరబడి..ఉనికిని..చాటుకొంటు౦ది..ప్రేమ..

పట్టణాల ట్రాఫిక్కులూ...
పల్లెల చిక్కులూ..బిక్కు బిక్కులూ..
చిట్టా విప్పుతుంటాయి...

చావులు పుట్టుకలూ..
పెళ్ళిళ్ళూ ..ఉరిత్రాళ్ళూ...
కవిత ఇంటికి తోరణాలు కడుతూ ఉంటాయి...
అప్పులు..ఆకలి 
రాజకీయాలు..అవినీతి...
మొక్కుబడిగా..తామూ..ఓ చెయ్యి వేస్తుంటాయి..

విప్లవాల మార్గం విడిచి...
ఉద్యమాల.స్థైర్యం..మరచి
వస్తువు..కొత్త దారులు వెతుక్కొంటో౦ది..
కాదేదీ కవిత కనర్హం..అన్నది..అక్షర సత్యమౌతోంది..
అయినా కూడా...నాకు వస్తువు..దొరకడం లేదు..
కాస్త మీరైనా..చెప్పరూ...
దాని ఆచూకి..!!


(26-12-2012)

No comments:

Post a Comment